Uttar Pradesh: నన్ను భయపెట్టాలని ఆజంఖాన్ చూస్తున్నారు: జయప్రద
- ఆజంఖాన్ కు ఎన్నికల్లో పోటీ చేసే అనుమతివ్వొద్దు
- ములాయం, అఖిలేశ్ లకు ముస్లింల ఓట్లు కావాలి
- అందుకే, ఆజంఖాన్ పై చర్యలు తీసుకోవట్లేదు
బీజేపీ నేత, సినీ నటి జయప్రదపై సమాజ్ వాదీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జయప్రద స్పందిస్తూ, మహిళలను చులకన భావంతో చూసే ఆజంఖాన్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈసీ అనుమతివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ములాయం, అఖిలేశ్ యాదవ్ లకు ముస్లింల ఓట్లు కావాలని, అందుకే, ఆజంఖాన్ పై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ములాయం, అఖిలేశ్ కుటుంబాల్లోని మహిళలకు ఇలాంటి అవమానం జరిగితే వాళ్లు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. రామ్ పూర్ నుంచి బరిలోకి దిగుతున్న తనను ఆజంఖాన్ భయపెట్టాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంపూర్ విడిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.