rahul dravid: విధి విచిత్రం.. అందరినీ ఓటు వేయమని చెబుతున్న ద్రవిడ్ మాత్రం ఓటు వేయలేకపోతున్నాడు!
- ఇటీవలే కొత్త ఇంటికి మారిన ద్రవిడ్
- పాత్ అడ్రస్ నుంచి ఫామ్-7 దరఖాస్తు చేసిన ద్రవిడ్ సోదరుడు
- ఓటు నమోదు విషయాన్ని మరిచిపోయిన ద్రవిడ్
క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఈ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయాడు. కర్ణాటక ఎలక్షన్ కమిషన్ బ్రాండ్ అంబాసడర్ గా రాహుల్ ఉండటం గమనార్హం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ ద్రవిడ్ ముఖ చిత్రంతో ఉన్న బోర్డులు, బిల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ, ఆయన తన ఓటును తానే వేసుకోలేకపోతుండటం విచిత్రం. అసలేం జరిగిందంటే...
ఓటర్ లిస్టు నుంచి రాహుల్ ద్రవిడ్ పేరును తొలగించారు. ఆ తర్వాత అతని పేరు మళ్లీ నమోదు కాలేదు. దీనికంతా కారణం ద్రవిడే. ఇటీవలి దాకా బెంగళూరులో తమ పెద్దల నుంచి వచ్చిన ఇంట్లోనే ద్రవిడ్ ఉండేవాడు. ఇటీవలే అతను కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాత అడ్రస్ నుంచి రాహుల్ ఓటును తొలగించాలని అతని సోదరుడు ఫామ్-7ను దరఖాస్తు చేశాడు. దీంతో, ఓటరు జాబితా నుంచి రాహుల్ పేరును ఈసీ తొలగించింది.
అయితే, కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత ఓటరు జాబితాలో నమోదు కోసం రాహుల్ దరఖాస్తు చేసుకోలేదు. తన పేరును నమోదు చేసుకునేందుకు రాహుల్ ఫామ్-6ను దరఖాస్తు చేయాల్సి ఉంది. క్రికెట్ వ్యవహారాల్లో బిజీగా ఉండే ద్రవిడ్... మార్చి 16వ తేదీ (నమోదుకు చివరి తేదీ) తర్వాత కానీ ఈ విషయాన్ని గమనించలేకపోయాడు. కానీ అప్పటికే ఓటరు నమోదుకు సమయం అయిపోయింది. రాహుల్ పాత ఓటు బెంగళూరులోని శాంతినగర్ లోక్ సభ నియోజకవర్గంలో ఉండేది.
మరోవైపు, రాహుల్ కొత్త నివాసానికి తమ అధికారులు రెండు సార్లు వెళ్లారని మత్తికెరె సబ్ డివిజన్ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారి చెప్పారు. అయితే, ఇంట్లో ఉన్నవారిని కలిసేందుకు వారిని అనుమతించలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న ద్రవిడ్... చివరకు తన ఓటును తాను వేసుకోలేకపోతుండటం విచిత్రం.