Telugudesam: నెల్లూరులోని ఓ కాలేజీ వద్ద పడివున్న వీవీ ప్యాట్ ఓటర్ రసీదు... స్పష్టంగా కనిపిస్తున్న వైసీపీ అభ్యర్థి పేరు, ఫ్యాన్ గుర్తు!
- దీన్ని ఎలా అర్థంచేసుకోవాలి?
- రసీదును భద్రపరచాల్సిన బాధ్యత లేదా?
- ట్వీట్ చేసిన హరిప్రసాద్
ఏపీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు ఎంత లోపభూయిష్టంగా ఉందో ఓవైపు సీఎం చంద్రబాబునాయుడు ఎలుగెత్తి చెబుతుండగా, అదే సమయంలో వీవీ ప్యాట్లో ఉండాల్సిన ఓటర్ రసీదు నెల్లూరులోని ఓ కాలేజి వద్ద పడివుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ సాంకేతిక నిపుణుడు, ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"నెల్లూరులోని ఓ జూనియర్ కాలేజీ వద్ద ఎవరో ఈ ఓటర్ రసీదును చూశారు. ఇది మాక్ పోలింగ్ సందర్భంగా తీసిన రసీదు అయ్యుంటుందా? అయితేమాత్రం, వీవీ ప్యాట్ నుంచి వచ్చిన ఎలాంటి రసీదునైనా భద్రపరచాల్సిన అవసరంలేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?" అంటూ మండిపడ్డారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి సాయపడేందుకు ఎంతోమంది విజిల్ బ్లోయర్లు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వాళ్లను వేధించే బదులు రక్షణ కల్పిస్తే చాలని హరిప్రసాద్ తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. కాగా, ఆ ఓటర్ రసీదులో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి.