Drunk Driving: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపిన వారికి జైలు శిక్ష!
- 59 మందికి రెండు రోజుల జైలుశిక్ష
- 78 మందికి 15 రోజుల వరకూ శిక్ష
- సెల్ ఫోన్ డ్రైవింగ్ కు రూ. 1000 జరిమానా
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 59 మందికి కూకట్ పల్లి 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 2 రోజుల జైలుశిక్ష విధించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 137 మందిని పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి శ్రీదేవి విచారించి శిక్షలు ఖరారు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 78 మందికి 3 నుంచి 15 రోజుల శిక్ష విధించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ పట్టుబడ్డ ముగ్గురికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. వీరు మరోసారి ఇలాగే పట్టుబడితే, జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. కూకట్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, బాలానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిపిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.