Rahul Gandhi: రాహుల్ గాంధీ-కేజ్రీవాల్ మధ్య ట్వీట్ల యుద్ధం.. పొత్తు పొడవడం కష్టమేనా?
- ఆప్‌కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న రాహుల్
- కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారని మండిపాటు
- యూటర్న్ గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న కేజ్రీవాల్
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ-ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తుపై తొలిసారి స్పందించిన రాహుల్ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తాము స్నేహ హస్తం చాస్తున్నా కేజ్రీవాల్ దూరం పెడుతున్నారని ఆరోపించారు. పొత్తులో భాగంగా ఆప్‌కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధమైనా కేజ్రీవాల్ మాత్రం యూటర్న్ తీసుకున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. పొత్తుపై ఏమీ తేల్చకుండా చర్చలను ప్రతిష్ఠంభనలోకి నెట్టేశారని, ఇప్పుడు ఏకంగా యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. అయితే, తాము మాత్రం తలుపులను తెరిచే ఉంచామన్న రాహుల్.. సమయమే మించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పొత్తుపై రాహుల్ చేసిన విమర్శలకు కేజ్రీవాల్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. రాహుల్‌కు ట్వీట్లు చేయడంపై ఉన్న శ్రద్ధ పొత్తుపై లేదంటూ ట్వీట్ చేశారు. యూటర్న్ గురించి రాహుల్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పొత్తుపై చర్చలు కొనసాగుతుండగానే ఈ ట్వీట్లు ఏంటని మండిపడ్డారు. చూస్తుంటే ట్వీట్లు చేయడంపై ఉన్న శ్రద్ధ పొత్తుపై ఉన్నట్టు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆ పార్టీ చీఫ్‌లను ఓడిస్తానంటున్న రాహుల్.. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా వారికే లబ్ధి చేకూరుస్తారని కేజ్రీవాల్ ఆరోపించారు. రాహుల్-కేజ్రీవాల్ పరస్పర విమర్శలు చూస్తుంటే ఢిల్లీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు.