France: ప్రపంచ క్రైస్తవ సమాజం దిగ్భ్రాంతి... చర్చ్ ని తిరిగి నిర్మిస్తామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
- చర్చ్ లో ఇంకా ఎగసి పడుతున్న మంటలు
- నిర్విరామంగా పని చేస్తున్న ఫైర్ ఫైటర్స్
- పునర్నిర్మాణానికి 100 మిలియన్ యూరోలు ప్రకటించిన హెన్రీ పినాల్ట్
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో సుప్రసిద్ధ నోట్రే డామే కేథడ్రల్ చర్చ్ మంటలకు ఆహుతికాగా, ప్రపంచ క్రైస్తవ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చ్ ప్రపంచ పురాతన కట్టడాల్లో ఒకటి. పారిస్ కు వచ్చే విదేశీయులు ఈ చర్చ్ ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. అటువంటి చర్చ్ లో భారీ అగ్నిప్రమాదం జరుగగా, దీన్ని తిరిగి నిర్మిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఎన్నో గంటల పాటు శ్రమించిన ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తెచ్చారని ఆయన అన్నారు. చర్చ్ లో ఇంకా కొద్దిపాటి మంటలు ఎగసిపడుతున్న కారణంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తూనే ఉన్నారని మేక్రాన్ మీడియాకు వెల్లడించారు.
చర్చ్ కి అంటుకున్న మంటలు అత్యంత భయానకంగా కనిపించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆకాశం నుంచి హెలికాప్టర్ ద్వారా నీళ్లు చల్లించాలని ఆయన సూచించగా, ఆ పని చేస్తే, చర్చ్ పూర్తిగా నేలమట్టం కావచ్చన్న ఆందోళనతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల ద్వారానే తమ ప్రయత్నాలు సాగించారు. కాగా, ఫ్రెంచ్ బిలియనీర్ ఫ్రాంకోయిస్ హెన్రీ పినాల్ట్, నోట్రే డామే కేథడ్రల్ చర్చ్ పునర్నిర్మాణానికి తనవంతుగా 100 మిలియన్ యూరోలను విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.