Summer: భాగ్యనగరిలో 40 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రత!
- ఎండ తీవ్రతను తట్టుకోలేక పోతున్న ప్రజలు
- తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
- వెలవెలబోతున్న పర్యాటక ప్రాంతాలు
ఇంకా రోహిణి కార్తె రాలేదు. అప్పుడే భానుడి భగభగలు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేని ప్రజలు, ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ సీజన్ లో హైదరాబాద్ లో తొలిసారిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరెంట్ కు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం వేళ, వీధులు బోసిపోతుండగా, పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో ఎండలు అధికంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, నిన్న నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.