IT Grids: ఐటీ గ్రిడ్స్ అశోక్ కోసం ఏపీలో వేట మొదలుపెట్టిన తెలంగాణ పోలీసులు!
- అశోక్ ఏపీలో తలదాచుకున్నాడని అనుమానం
- విచారణకు రావాలని నోటీసులిచ్చినా స్పందన నిల్
- అరెస్ట్ చేసి ప్రశ్నించాలని నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆధార్ సమాచారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ బృందం ఏపీలో వేట ప్రారంభించింది. అశోక్ ఏపీలోనే ఆశ్రయం పొందాడన్న సమాచారాన్ని గుర్తించిన సిట్ టీమ్, త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా హాజరు కాకపోవడంతోనే అరెస్ట్ చేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ కేసు రెండు నెలల క్రితమే నమోదైనప్పటికీ, ఎన్నికల హడావుడి కారణంగా ఫైల్ వర్క్ కు మాత్రమే పరిమితమైన సిట్ అధికారులు, ఇప్పుడు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అశోక్ ను అరెస్ట్ చేస్తేనే కీలక ఆధారాలు లభ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక ఐటీ గ్రిడ్స్ లో జరిపిన తనిఖీల్లో హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకుని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా, మొత్తం 7.82 కోట్ల మంది రికార్డులు ఉన్నాయని వెల్లడైన సంగతి తెలిసిందే.