mallya: 'మాల్యా, నీరవ్ మోదీలే కాదు.. 36 మంది వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోయారు'
- అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు విచారణ సందర్భంగా వెల్లడించిన ఈడీ
- సుషేన్ కు బెయిల్ ఇవ్వరాదని విన్నపం
- సమాజంలో పలుకుబడి ఉందంటూ బెయిల్ కోరడాన్ని తప్పుబట్టిన ఈడీ
ఆర్థిక నేరాలకు పాల్పడి, దేశాన్ని విడిచిపోయినవారు ఎవరంటే మనకు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలే గుర్తుకొస్తారు. కానీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించిన సంఖ్య తెలిస్తే షాక్ అవుతాం. పలు కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న 36 మంది వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని ఈడీ సంచలన విషయాన్ని వెల్లడించింది.
దేశాన్ని కుదిపేస్తున్న అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణం విచారణ సందర్భంగా... ఈ కేసులో అరెస్టైన సుషేన్ మోహన్ గుప్తా బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ వాదనలను విన్నారు. ఈ సందర్భంగా సుషేన్ కు బెయిల్ ఇవ్వరాదని కోర్టును ఈడీ కోరింది. ఇతడిలా ఆర్థిక నేరాలకు పాల్పడిన 36 మంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపింది. సమాజంలో తనకు మంచి పేరు ఉందంటూ సుషేన్ బెయిల్ కోరడాన్ని తప్పుబట్టింది. మాల్యా, నీరవ్ మోదీలకు కూడా సమాజంలో మంచి పలుకుబడి ఉందని తెలిపింది.