Andhra Pradesh: తమిళనాడుకు స్టాలిన్ వంటి సమర్థ నాయకత్వం అవసరం: ఏపీ సీఎం చంద్రబాబు
- స్టాలిన్ ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక
- తమిళనాడు అభివృద్ధి కోసం డీఎంకే అధికారంలోకి రావాలి
- చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం
చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమిళనాడుకు స్టాలిన్ వంటి సమర్థ నాయకత్వం అవసరమని, కరుణానిధి వారసుడు స్టాలిన్ ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని అన్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం డీఎంకే అధికారంలోకి రావాలని, ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని తమిళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన విరుచుకుపడ్డారు. జల్లికట్టును నిషేధించి తమిళ సంస్కృతిని అవమాన పరిచారని, నాడు గజ తుపాన్ తో తమిళనాడుకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ రాష్ట్రాన్ని కేంద్రం ఏ మాత్రం ఆదుకోలేదని విమర్శించారు.
అన్నా డీఎంకే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఆ పార్టీకి ఓటేస్తే మోదీకి వేసినట్టేనని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కాగా, చంద్రబాబు వెంట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ తదితరులు ఉన్నారు. చెన్నై లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థులు పాల్గొన్నారు.