Andhra Pradesh: దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కోడెల శివప్రసాద్
- ఇనిమెట్ల ఘటనలో నాపై కేసు పెట్టారు
- నా కేమీ బాధ లేదు..నిజాలు తేలాలి
- పోలింగ్ బూత్ లోని సీసీ ఫుటేజ్ ను బయటకు తీయాలి
ఇనిమెట్ల ఘటనలో తనపై కేసు పెట్టినందుకు తన కేమీ బాధ లేదని ఏపీ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నా మీద కేసు పెట్టినందుకు నా కేమీ బాధ లేదు. చట్టప్రకారం కంప్లయింట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తారు. చెయ్యనివ్వండి. నిజాలు తేలాలి. పోలింగ్ బూత్ లో ఉన్న ఫుటేజ్ ను బయటకు తీయండి.
నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు, దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కక్షతో ఉండం, చట్టంతో పని చేస్తాం. ఎందుకంటే, ఇలాంటి దౌర్జన్యాలకు అనుమతిస్తే, రాష్ట్రం మళ్లీ రావణకాష్టం అవుతుంది. అది అరికట్టాలంటే, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి, శాంతి’ తన నినాదం అని, ఐదేళ్ల పాటు నరసరావుపేట, సత్తెనపల్లిలో అక్రమాలు జరగకుండా చూశానని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని, మహిళలు, పింఛన్ల లబ్ధిదారులు టీడీపీ వెంటే ఉన్నారని, టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.