Sumalata: చీరకొంగు చాచి ఓట్లను అడిగిన సుమలత!
- ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను
- అంబరీశ్ మృతిని రాజకీయం చేస్తున్నారు
- ఓటర్లపై తనకు నమ్మకం ఉందన్న సుమలత
"గత నాలుగు వారాలుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. ఎన్నో అవమానాలను, అవహేళనలను, బెదిరింపులను ఎదుర్కొన్నాను. వాటిని మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. అంబరీశ్ మృతిని కూడా సీఎం కుమారస్వామి రాజకీయాలకు వాడుకుంటున్నారు" అని ఈ సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ పడుతున్న నటి సుమలత ఆరోపించారు.
పట్టణంలో జరిగిన స్వాభిమాన సమ్మేళన ర్యాలీలో సినీ హీరోలు యశ్, దర్శన్ లతో కలిసి పాల్గొన్న ఆమె, తన కొంగుచాచి ఓట్లను అర్థించారు. అంబరీశ్ కు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన కుమారస్వామి, తనకు సోదరుడిలా జీవితాంతం తోడుంటానని మాటిచ్చి తప్పారని విమర్శలు గుప్పించారు. అంబరీశ్ సమాధిపై ఆయన తన కుమారుడికి రాజకీయ బాటలు వేయాలని చూస్తున్నారని అన్నారు. తనకు ఓటర్లపై నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని గెలిపించాలని, తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని భావోద్వేగంతో మాట్లాడారు. అంబరీశ్ లేరనే ధైర్యంతో రెచ్చిపోతున్న వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.