Telangana: ఫోన్ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్ చేస్తే స్పందించలేదని మరొకరు ఆత్మహత్య
- కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఘటన
- రెండు ఘటనలకూ సెల్‌ఫోనే కారణం
- ప్రాణాలు తీసుకున్నది కూడా వివాహితలే
స్మార్ట్‌ఫోన్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫోన్ కొనివ్వలేదని భర్తతో గొడవపడి ఒకరు.. ఫోన్ చేస్తే స్పందించలేదని మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని బాలసముద్రానికి చెందిన కృష్ణవేణి-శాంతిభూషణ్ రెడ్డి భార్యాభర్తలు. సోమవారం రాత్రి కుమారుడితో కలిసి బయటకు వెళ్లిన శశిభూషణ్ రెడ్డి రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో భార్య కృష్ణవేణి అతడికి ఫోన్ చేసింది. భర్త ఫోన్ ఎత్తకపోవడంతో మనస్తాపానికి గురైంది. రాత్రి 11 గంటలకు ఇంటి చేరుకున్న భర్తతో గొడవ పడింది. ఫోన్ చేస్తే ఎందుకు లేపలేదని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అనంతరం ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. భర్తతో గొడవ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మరో ఘటనలో.. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన కడమంచి స్వామి- స్వప్న(20) దంపతులు. రెండేళ్ల క్రితమే వివాహమైన వీరికి ఏడు నెలల పాప ఉంది. భర్త స్మార్ట్‌ఫోన్‌ను తాకిన ప్రతిసారి అతడు గొడవకు దిగేవాడు. తన ఫోన్ ముట్టుకోవద్దని చాలాసార్లు హెచ్చరించాడు. దీంతో, తనకూ ఓ ఫోన్ కొనివ్వాలని స్వప్న మంగళవారం పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన స్వామి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లోంచి విసురుగా వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోవడంతో మనోవ్యధకు లోనైన స్వప్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.