Chandrababu: సీఈసీ బ్లడ్ శాంపిల్స్ కామెంట్‌కు చంద్రబాబు ఘాటు కౌంటర్
- గాయమైతే ఒక చోటి నుంచి రక్తం సేకరిస్తే సరిపోతుంది
- రక్తం మొత్తం పాడైతే రోజూ డయాలసిస్ చేయాల్సిందే
- మా పోరాటం ఇకపైనా కొనసాగుతుంది
ఎన్నికల్లో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు సంఖ్యను పెంచాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండుపై ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందిస్తూ చేసిన ‘బ్లడ్ శాంపిల్’ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. వీవీప్యాట్ స్లిప్పుల్లో 50 శాతం లెక్కించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కొట్టిపడేసిన అరోరా.. రోగ నిర్ధారణకు శరీరంలోని ఓ చోటనుంచి రక్త నమూనా సేకరిస్తామే తప్ప 20 చోట్ల నుంచి రక్తాన్ని సేకరించబోమని తేల్చి చెప్పారు.
అరోరా చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చెన్నైలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గాయమైతే ఒక చోటి నుంచి రక్తం సేకరిస్తే సరిపోతుందని, కానీ రక్తం మొత్తం చెడిపోయినప్పుడు రోజూ డయాలసిస్ చేయాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంల దుర్వినియోగం, పనితీరుతో ఈసీకి వ్యాధి ముదిరినట్టే ఉందని చంద్రబాబు విమర్శించారు. దేశం కోసం తాము చేస్తున్న పోరాటం మున్ముందూ కొనసాగుతుందన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.