USA: సముద్రంలో కుప్పకూలిన అత్యంత ఖరీదైన యుద్ధవిమానం... శకలాల కోసం పోటీపడుతున్న అమెరికా, రష్యా!
- యూఎస్ కు మద్దతుగా జపాన్
- విడిభాగాల కోసం చైనా ప్రయత్నం!
- ఈ ప్రాజక్టు ఖరీదు రూ.104 లక్షల కోట్లు
ఈ నెల 9వ తేదీ జపాన్ లోని మిసావా ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఎఫ్35ఏ యుద్ధ విమానం కాసేపటికే పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. రాడార్ పై దీని ఆచూకీ తెలియకపోవడంతో ఇది సముద్రంలో కూలి ఉంటుందని భావిస్తున్నారు. తన మిత్రదేశాల రక్షణ కోసం అమెరికా అత్యంత వ్యయంతో ఈ విమానాన్ని అభివృద్ధి చేసింది. ఈ ప్రాజక్టు మొత్తం వ్యయం రూ.104 లక్షల కోట్లు. ఒక్కో విమానం ఖరీదు సుమారు 100 మిలియన్ డాలర్ల (సుమారు 690 కోట్లు) వరకు ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశం వద్ద లేని అత్యాధునిక టెక్నాలజీ ఈ విమానంలో పొందపరిచారు.
అయితే, ఈ విమానం కూలిపోయిందన్న సమాచారంతో అమెరికా, జపాన్ ఉలిక్కిపడ్డాయి. ఆ విమాన శకలాల కోసం ఆగమేఘాలపై ప్రపంచం నలుమూలల ఉన్న తన అత్యాధునిక గాలింపు పరికరాలను అమెరికా పసిఫిక్ మహాసముద్రంలో మోహరించింది. జపాన్ కూడా అన్నివిధాలా సహకరిస్తోంది. అందుకు బలమైన కారణం ఉంది. ఆ విమానంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం పొరబాటున రష్యా, చైనా వంటి ప్రత్యర్థుల చేతిలో పడితే ఆ భారీ ప్రాజక్ట్ కు అర్థమే ఉండదని అమెరికా ఆందోళన చెందుతోంది.
ముఖ్యంగా ఈ విషయంలో రష్యా గురించే అమెరికా బాగా భయపడుతోంది. ఇప్పటికే రష్యా రంగంలోకి దిగినా ఎక్కడా ఆ విషయం బయటికి పొక్కనీయలేదు. ఆ విమానం ఇంజిన్ లో ఒక్క భాగం దొరికినా చాలు, రివర్స్ ఇంజినీరింగ్ తో ఆ విమానాన్ని యధాతథంగా రూపొందించగల సామర్థ్యం ప్రపంచం మొత్తమ్మీద ఒక్క రష్యాకే ఉంది. చైనాకు ఆ సామర్థ్యం లేకపోయినా విడిభాగాలను ఎత్తుకెళ్లి అమెరికాకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.
1968లో సోవియట్ యూనియన్ కు చెందిన కె129 అనే జలాంతర్గామి సముద్రంలో మునిగిపోగా అమెరికా ఆరేళ్ల తర్వాత దాని జాడ కనుగొని దాంట్లో ఉపయోగించిన టెక్నాలజీ మొత్తం చేజిక్కించుకుంది. అప్పట్లో సోవియట్ యూనియన్ వద్ద నీటి అడుగుభాగంలో గాలింపు జరిపే సాధనాలు లేవు. కానీ ఇప్పుడు అలాకాదు. షాడో సబ్ మెరైన్లు, అండర్ వాటర్ డ్రోన్లకు రష్యా పెట్టింది పేరు. ఇప్పుడు అమెరికా భయపడుతోంది కూడా ఈ విషయంలోనే! ఎక్కడ తన లక్ష కోట్ల ప్రాజక్ట్ టెక్నాలజీని రష్యా చేజిక్కించుకుంటుందేమోనని హడలిపోతోంది. అందుకే రష్యా కంటే ముందే ఎఫ్35 శకలాల వెలికితీతకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.