Gopala krishna Dwivedi: ఏపీ ఎన్నికల్లో కలెక్టర్ల నిర్లక్ష్యంపై రాష్ర ఎన్నికల ప్రధాన అధికారి ఫైర్
- 600 మంది బెల్ ఇంజినీర్లను పంపినా నిర్లక్ష్యం
- రూట్ మ్యాపులు సైతం ఇవ్వలేదు
- మైనర్లు ఓటు వేయడంపై నివేదిక
- ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిపై కేసులు
ఏపీ ఎన్నికల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఈవీఎం నిపుణులను కేటాయించినా వారి సేవలను వినియోగించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. 600 మంది బెల్ ఇంజినీర్లను ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి పంపించినా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాంకేతిక నిపుణులకు కొన్ని జిల్లాల్లో రూట్ మ్యాపులు సైతం ఇవ్వకపోవడాన్ని ద్వివేది తీవ్రంగా పరిగణించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనపై నివేదిక ఇవ్వాలని, అలాగే సాయంత్రం 6 గంటల తరువాత కూడా పోలింగ్ నిర్వహించడంపై కలెక్టర్ల నుంచి రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కొన్ని కేంద్రాలకు ఈవీఎంలను ఆలస్యంగా ఇవ్వడంపై కూడా ద్వివేది నివేదిక కోరారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన కలెక్టర్లపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.