Gopala krishna Dwivedi: ఏపీలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్.. 12 మంది అధికారులపై చర్యలకు సిఫారసు: ద్వివేది
- ఓటర్లకు తలెత్తిన అసౌకర్యంపై నివేదిక
- మీడియా కథనాల్లో వాస్తవం లేదు
- నివేదిక ఇచ్చిన జిల్లా కలెక్టర్
ఏపీలో కలెక్టర్ల నివేదిక మేరకు ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా 12 మంది అధికారులపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు.
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ పోలింగ్ కేంద్రం, నరసరావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసనపల్లిలో 94వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధి కలనూతలలో 247 పోలింగ్ కేంద్రం, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం అటకానితిప్పలో 197వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తలెత్తిన అసౌకర్యాలపై 13 జిల్లాల కలెక్టర్లను నివేదిక కోరినట్టు ద్వివేది తెలిపారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు ఆలస్యంగా వెళ్లినట్టు వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం లేదని ఆ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారని ఆయన తెలిపారు.