Tamilnadu: ఎన్నికల తనిఖీలో భాగంగా 1381 కేజీల బంగారం పట్టివేత!
- టీటీడీకి సంబంధించిన బంగారమన్న నిందితులు
- పీఎన్బీ నుంచి తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడి
- తమకేం సంబంధం లేదంటున్న టీటీడీ
ఎన్నికల తనిఖీల్లో భాగంగా తమిళనాడు అధికారులు పెద్ద మొత్తంలో బంగారం పట్టుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో ఏకంగా 1381 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదని నిందితులు చెబుతున్నారు.
కాగా బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తరలిస్తున్నారని విచారణలో తేలింది. టీటీడీ చేసిన బంగారం డిపాజిట్ గడువు తీరడంతో, బంగారాన్ని తీసుకెళ్లాలని టీటీడీకి అధికారులు సూచించారు. అయితే, అంతలోనే పీఎన్బీ అధికారులు బంగారాన్ని తరలించారు. ఇదిలావుంచితే, పట్టుబడ్డ బంగారంతో తమకెలాంటి సంబంధం లేదని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. తమ బంగారాన్ని తమకు అప్పగించాల్సిన బాధ్యత పీఎన్బీదేనని తేల్చి చెప్పింది.