Hyderabad: రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్!
- రేపు హనుమాన్ శోభాయాత్ర
- 400 సీసీ కెమెరాలు, 8 వేల మంది సిబ్బంది
- భారీ బందోబస్తు ఏర్పాట్లు
శుక్రవారం నాడు హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర జరగనున్న సందర్భంగా భద్రతపై దృష్టి పెట్టిన పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. 400 సీసీ కెమెరాలు సహా, 8 వేల మంది సిబ్బందితో అనుక్షణం నిఘాను పెట్టనున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నగరంలో హనుమాన్ శోభాయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మూసి ఉంచాలన్న ఆదేశాలు వెలువరించామని వెల్లడించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తో కలిసి హనుమాన్ శోభాయాత్రపై సమీక్ష జరిపిన పోలీసు ఉన్నతాధికారులు, యాత్ర నిర్విఘ్నంగా సాగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రేపు యాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నామని, ప్రజలు అందుకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకు గౌలిగూడలో యాత్ర ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్ తాడ్ బండ్ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద ముగుస్తుందని పేర్కొన్నారు.