Ali Ashraf Fatmi: ఆర్జేడీకి షాకిచ్చిన అలీ అష్రఫ్.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
- దర్భంగ నుంచి నాలుగుసార్లు ఎన్నికైన అలీ
- ఆశించిన రెండు స్థానాల్లోనూ దక్కని టికెట్
- మనస్తాపంతో పార్టీకి రాజీనామా
ఆర్జేడీ నేత, కేంద్ర మాజీ మంత్రి అలీ అష్రఫ్ ఫాత్మి బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. బీహార్‌లోని దర్భంగ, మధుబని సీట్లను ఆశించిన అలీకి అధిష్ఠానం మొండిచేయి చూపడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ టికెట్‌పై దర్భంగ నుంచి నాలుగుసార్లు ఎన్నికైన అలీ.. ఈసారి మధుబని నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు తెలిపారు.
బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో నేడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఆయనీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈసారి దర్భంగ టికెట్‌ను సీనియర్ నేత అబ్దుల్ బారీ సుద్దఖికి ఇచ్చిన ఆర్జేడీ.. అలీకి మధుబని టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఆ టికెట్ ను సీట్ల పంపకంలో భాగంగా మహాకూటమి అభ్యర్థికి కేటాయించడంతో మనస్తాపం చెందిన అలీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మధుబని నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.