Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో ‘మైనర్ల ఓటింగ్’ వివాదం...అసలేం జరిగింది?
- దర్యాప్తునకు ఆదేశించిన ఎన్నికల అధికారులు
- వారంతా మేజర్లే అని ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వెల్లడి
- నేడు గ్రామంలో ఆర్‌ఐ, వీఆర్‌ఓల విచారణ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 11వ తేదీన జరిగిన పోలింగ్‌లో శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వంగర మండలం సంగాం గ్రామంలో 20 నుంచి 36 మంది మైనర్లు ఓటు వేశారన్న అంశంపై వివాదం కొనసాగుతోంది. ఓ వైపు ఎన్నికల అధికారులు అటువంటిదేమీ లేదని, వారంతా మేజర్లేనని చెబుతుంటే మరోవైపు ఫిర్యాదు దారులు వారు మైనర్లేనని ఆరోపిస్తున్నారు.
దీంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఎన్నికల అధికారి జయదేవి ప్రాథమిక నివేదిక సమర్పించడమేకాక, ఈరోజు గ్రామంలో ప్రత్యక్ష విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే...గ్రామంలోని 43, 44 పోలింగ్ బూత్ లలో కొందరు మైనర్లు ఓటు వేశారని గ్రామానికి చెందిన టీడీపీ నేత బి.శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కలెక్టర్ రాజాం ఎన్నికల అధికారిని దీనిపై దర్యాప్తు జరపాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన ఎన్నికల అధికారి ఓటర్ల వివరాలపై ఆరాతీశారు. వారి పుట్టిన తేదీల ధ్రువపత్రాల ఆధారంగా వీరంతా 18 ఏళ్లు నిండిన వారేనని తేలడంతో అదే విషయాన్ని కలెక్టర్‌కు నివేదించారు.
కానీ అక్కడితో వివాదానికి పుల్‌స్టాప్ పడలేదు. విషయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ సమగ్ర దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఎన్నికల అధికారి ఒక ఆర్‌ఐ, ఒక వీఆర్‌ఓను ఈరోజు గ్రామానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటర్లను విచారించాలని, ఓటు హక్కుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు సేకరించాలని ఆదేశించారు.
కాగా, రాజకీయ వైషమ్యాల వల్లే ఈ వివాదం రేకెత్తించారని ఆరోపిస్తున్న వారున్నారు. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి వెనకుండి ఈ తతంగాన్ని నడిపించాడని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ముందస్తు వ్యూహం ప్రకారమే పుట్టిన తేదీ ధ్రువపత్రాల్లో తేదీలు తారుమారు చేసి మైనర్లను మేజర్లుగా చూపించారని, ఓటు హక్కు పొందేలా చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే, వీరి ప్రత్యర్థుల ఆరోపణ మరోలా ఉంది. సంగాం గ్రామంలో ఒకప్పుడు ఎవరికీ స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉండేది కాదని, ఈసారి గ్రామస్థులు స్వేచ్ఛగా ఓటు వేసుకోవడం చూసి తట్టుకోలేక టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. సంగాం గ్రామంలో ఇప్పటివరకు ఓ ‘పెద్ద’ ఇష్టారాజ్యం నడిచేదని, ఈసారి అది సాధ్యం కాలేదని, దీన్ని తట్టుకోలేకే ఈ తప్పుడు వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ బూత్‌లలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారని, వారంతా నిజంగానే మైనర్లయితే ఓటు వేసే సమయంలోనే వీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని వీరు ప్రశ్నిస్తున్నారు.
పల్లెటూర్లలో ప్రతి ఓటరు గురించి ఏజెంట్లకు తెలుస్తుందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకంటున్నారు. పైగా పోలింగ్ పూర్తయిన కొన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం వ్యూహాత్మకమేనంటున్నారు. కేవలం తమకు ఓట్లు పడలేదేమో అన్న అనుమానంతోనే టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజానిజాలు ఏమిటో దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.