Andhra Pradesh: పసుపు-కుంకుమ డబ్బులతో.. 20 ఏళ్ల నీటి సమస్యను పరిష్కరించిన డ్వాక్రా మహిళలు!
- ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘటన
- పసుపు-కుంకుమ నిధులతో ట్యాంకు ఏర్పాటు
- మహిళల చొరవపై సర్వత్రా హర్షం
ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ‘పసుపు-కుంకుమ’ నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో మహిళకు రూ.10,000 చొప్పున ప్రభుత్వం చెక్కులను జారీచేసింది. అయితే చాలామంది మహిళలు ఈ డబ్బులను ఇంట్లో ఖర్చులకు వాడుకున్నారు. అయితే విజయనగరం జిల్లాలోని చాపరాయవలస ఊరి మహిళలు మాత్రం ‘పసుపు-కుంకుమ’ నిధులతో 20 ఏళ్లుగా ఊరిని పట్టిపీడిస్తున్న నీటి సమస్యకు చెక్ పెట్టారు.
విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలం చాపరాయవలస గ్రామంలో గత 20 ఏళ్లుగా నీటి సమస్య ఉంది. రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినా నీటి సమస్య తీరలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పసుపు-కుంకుమ నిధులను అందించింది.
దీంతో ఈ డబ్బులతో సమస్యలను పరిష్కరించుకోవాలని చాపరాయవలస గ్రామ మహిళలు భావించారు. కొత్త వ్యాటర్ ట్యాంకు ఏర్పాటుకు రూ.లక్ష వరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం పొదుపు సంఘాల్లోని ఒక్కో మహిళ రూ.6 వేలను ఇచ్చారు. అలాగే వారివారి భర్తలు తలో రూ.2,000 అందించారు.
చివరికి కావాల్సిన నిధులు అందడంతో 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు నిర్మాణాన్ని త్వరితగతిన ఏర్పాటుచేసుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో ఊరిలో నెలకు ఓ రోజు మాత్రమే నీరు వచ్చేదని తెలిపారు. తాగునీటి కోసం తాము కిలోమీటర్ దూరంలో ఉన్న బోరు వద్దకు వెళ్లాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు.
ఎండాకాలంలో అయితే నీటికి తీవ్రమైన కటకట ఉండేదన్నారు. అయితే తాజాగా ట్యాంకు ఏర్పాటుతో ఊరిలోనే మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా, చాపరాయవలస మహిళలు తీసుకున్న చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.