Twitter: నిమిషాల్లో రెండు లక్షల రీట్వీట్లు తెచ్చుకున్న ఫొటో ఇది!
- అగ్నిప్రమాదంలో నాశనమైన పారిస్ చర్చ్
- ప్రమాదానికి నిమిషాల ముందు ఫోటో తీసిన యువతి
- ఫోటోలోని వారికి చేర్చేందుకు ప్రయత్నం
ప్రాన్స్ రాజధాని పారిస్ లో ఉన్న పురాతన నోట్రేడామే కేథడ్రల్ చర్చ్ ముందు తీసిన ఫోటో ఇది. 800 సంవత్సరాల నాడు ఎంతో శ్రమించి నిర్మించి, ఏసుక్రీస్తు ధరించిన ముళ్ల కిరీటాన్ని భద్రపరిచిన చర్చ్ ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయింది. చర్చ్ ని అగ్నికీలలు చుట్టు ముట్టడానికి నిమిషాల ముందు తీసిన ఫోటో ఇది. ఓ తండ్రి తన కుమార్తెను ఆడిస్తుండగా, అక్కడే ఉన్న బ్రూక్ విన్ డ్సర్ అనే యువతి దీన్ని క్లిక్ మనిపించింది. అంతకుముందే ఆమె చర్చ్ ని సందర్శించి బయటకు వచ్చింది. ఆపై ఈ ఫోటో తీసి, దీన్ని ఆయనకు చూపించి, షేర్ చేసుకోవాలని భావించింది. ఈలోగానే మంటలు ఎగసిపడటంతో అందరూ చెల్లాచెదురయ్యారు. ఇక ఈ ఫోటోను అతనికి ఎలాగైనా చేర్చాలన్న ఆలోచనలో ఉన్న బ్రూక్ విన్ డ్సర్, "ట్విటర్.. నీలో మ్యాజిక్ ఉంటే ఈ ఫోటో అతని కంటపడేలా చెయ్యి" అంటూ ట్వీట్ చేసింది. ఆపై నిమిషాల వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా రీట్వీట్లు, నాలుగు లక్షలకు పైగా లైక్ లు వచ్చేశాయి. ఇంకా ఈ ఫోటోను అతను చూశాడో లేదో తెలియరాలేదు.