Andhra Pradesh: కృష్ణా జిల్లా తాగునీటిపై సమీక్షకు 10 మంది ఎంపీడీవోల డుమ్మా.. షోకాజ్ నోటీసులు జారీచేసిన జెడ్పీ సీఈవో!
- ఏపీలో పలు ప్రాంతాలలో నీటికి కటకట
- నీటి ఎద్దడిపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం
- ఎందుకు గైర్హాజరు అయ్యారో చెప్పాలని నోటీసులు
వేసవి సమీపించడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి కటకట ఏర్పడుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ‘జలవాణి’ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో తాగునీటికి సంబంధించి విజయవాడలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.
అయితే ఇందుకు 10 మంది ఎంపీడీవోలు డుమ్మా కొట్టారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జిల్లాలో నీటి ఎద్దడిపై సాక్షాత్తూ కలెక్టర్ నిర్వహించిన సమావేశానికి రాకపోవడంపై ఈ 10 మంది ఎంపీడీవోలకు జెడ్పీ సీఈవో సలాం షోకాజ్ నోటీసులు జారీచేశారు. అసలు సమావేశానికి ఎందుకు గైర్హాజరు అయ్యారో చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.