yogi adithyanadh: యోగి ఆదిత్యనాథ్ డ్రామాలాడుతున్నారు: బీఎస్పీ అధినేత్రి మాయావతి
- యోగి ఆదిత్యనాథ్ ను ప్రచారానికి దూరంగా ఉండమన్న ఈసీ
- ఆలయాల దర్శనానికి వెళ్లిన యోగి ఆదిత్యనాథ్
- మీడియాలో కనిపించడానికే అంటోన్న మాయావతి
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. ఈసీ ఉత్తర్వులను యోగి మళ్లీ ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. 72 గంటల పాటు ఎటువంటి ప్రచార కార్యక్రమాలలోను ఆయన పాల్గొనకూడదని ఎన్నికల సంఘం ఆజ్ఞాపించినప్పటికీ, ఆయన మాత్రం ఆలయాల దర్శనం పేరుతో .. దళితుల ఇంట భోజనాల పేరుతో తిరుగుతూ, ఇదంతా మీడియాలో ప్రసారమయ్యేలా చూసుకుంటున్నారంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు.
ప్రచారానికిగాను తెలివిగా ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారని, ఈసీ విధించిన నిషేధ ఉత్తర్వులను ఆయన ఉల్లంఘించారనీ ఆమె విమర్శించారు. ఏమైనా ఈసీ బీజేపీ పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని, ఆ పార్టీ నేతల పట్ల చర్యలు తీసుకోకపోతే ఎన్నికలను సక్రమంగా నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని మాయావతి వ్యక్తం చేశారు.
అయితే, ఆమె ఆరోపణలను యూపీ సీఎం మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ఖండించారు. వ్యక్తిగత హోదాలో ఆలయాలకు వెళ్లడం, ఎవరైనా భోజనానికి పిలిస్తే వెళ్లడం ఈసీ ఉత్తర్వులను ఉల్లఘించడం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను చదవడం మాత్రమే కాకుండా, ఈసీ ఆర్డర్ కాపీలో ఏముందో కూడా మాయావతి చదివితే బాగుంటుందంటూ ఆయన చురక అంటించారు.