RGV: 'టైగర్ కేసీఆర్' మూవీ ట్యాగ్ లైన్ లో 'ఆడు' అనే పదానికి వివరణ ఇచ్చిన ఆర్జీవీ
- దీని లోతును కేసీఆర్, కేటీఆర్ అర్థం చేసుకుంటారు
- కేసీఆర్ ను తక్కువగా అంచనా వేశారు
- ట్వీట్ చేసిన వర్మ
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'టైగర్ కేసీఆర్' అంటూ మరో ప్రాజక్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ, రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, 'టైగర్ కేసీఆర్' టైటిల్ ను ప్రకటిస్తూ వర్మ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. టైటిల్ కింద ట్యాగ్ లైన్ గా 'అగ్రెసివ్ గాంధీ' అని, 'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అని సబ్ క్యాప్షన్ పెట్టారు.
అయితే, నెటిజన్లలో కొందరు 'ఆడు' అనే పదాన్ని తప్పుబట్టడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. కేసీఆర్ అంతటి గొప్ప వ్యక్తిని 'ఆడు' అనడం సరికాదని అనడం పట్ల తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. "ట్యాగ్ లైన్ లో ఉన్న 'ఆడు' అనే పదం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ల కోసమే ఈ ట్వీట్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించకముందు ఆయనను ఇతరులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఓ రకమైన తక్కువభావంతో చూశారు. అలాంటి వ్యక్తుల అభిప్రాయాన్ని వెల్లడించే దృష్టికోణంలోనే 'ఆడు' అనే పదం ఉపయోగించాల్సి వచ్చింది" అంటూ వివరణ ఇచ్చారు. అయితే, తన ట్యాగ్ లైన్ లో ఉన్న లోతును కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.