Democratic Republic of Congo: కాంగోలో విషాదం.. పడవ మునిగి 150 మంది గల్లంతు
- సామర్థ్యానికి మించి పడవలో బరువు
- సహాయక చర్యల్లో అండగా ఉంటామన్న ఐక్యరాజ్య సమితి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అధ్యక్షుడు
కాంగోలో పెను విషాదం చోటు చేసుకుంది. 150 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో అందులోని వారంతా గల్లంతయ్యారు. సోమవారమే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుండగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కీవూ సరస్సులో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని, 13 మంది ప్రాణాలు కోల్పోగా మిగతా వారి జాడ గల్లంతైందని ఆ దేశ అధ్యక్షుడు ఫెలిక్స్ త్సిసెకొడి గురువారం పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు అధ్యక్షుడు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు, ఇతర సామగ్రి ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సహాయక చర్యల విషయంలో కాంగో ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. కాగా, 2015లోనూ కాంగోలో ఇటువంటి ప్రమాదమే జరిగింది. అప్పట్లో పడవ బోల్తాపడి 100 మంది గల్లంతయ్యారు.