Gold: తమిళనాడులో పట్టుబడిన 1,381 కిలోల బంగారం.. నేడు తిరుమలకు తరలింపు
- రెండు వాహనాల్లో తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు
- ఆ నగలు టీటీడీవేనంటూ ఆధారాలు చూపించిన పీఎన్బీ అధికారులు
- విడుదలకు అంగీకరించిన ఉన్నతాధికారులు
చెన్నై నుంచి తిరుపతి తరలిస్తూ తమిళనాడులోని ఆవడి సమీపంలోని వేపంపట్టు చెక్‌పోస్టు వద్ద ఎన్నికల నిఘా బృందానికి పట్టుబడిన 1,381 కిలోల బంగారాన్ని నేడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖజానాకు తరలించనున్నారు. ఈ బంగారం టీటీడీకి చెందినదే అయినప్పటికీ దానిని తరలిస్తున్న వాహనాల వద్ద ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న అధికారులు పూందమల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం అధికారులను కలిసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు పట్టుబడిన నగలకు సంబంధించిన ఆధారాలు చూపించడంతో వాటి విడుదలకు మార్గం సుగమమైంది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని విడుదల చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే, కిందిస్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడంతో విడుదల ఆలస్యమైంది. నేడు ఈ బంగారం మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాలో జమ చేయనున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.