Vote: ఒక్క మహిళా ఓటరు కోసం 483 కిలోమీటర్లు ప్రయాణించిన ఏడుగురు సిబ్బంది!
- ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ
- టిబెట్ సరిహద్దుల్లో మలోగామ్ గ్రామం
- ఒక ఓటు కోసం ప్రయాసతో వెళ్లిన అధికారులు
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంత విలువ ఉందో అందరికీ తెలిసిన విషయమే. పోటీలో నిలిచిన అభ్యర్థుల తలరాత ఒక్క ఓటు తేడాతో కూడా మారిపోతూ ఉంటుంది. అంతటి శక్తిమంతమైన ఓటు కోసం, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎంతగా అంటే, కేవలం ఒకే ఒక్క ఓటు ఉన్న ప్రాంతానికి ఏడుగురిని పంపింది. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ లోని టిబెట్ సరిహద్దుల్లో ఉన్న మలోగామ్ గ్రామంలో జరిగింది.
అత్యంత ప్రయాసతో 483 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు రోజుల పాటు ప్రయాణించిన అధికారులు, ఓ మహిళతో ఓటు వేయించారు. గమ్మర్ బామ్ అనే ప్రిసైడింగ్ అధికారి, తన నలుగురు సిబ్బంది, ఓ సెక్యూరిటీ గార్డు, ఓ జర్నలిస్ట్ తో కలిసి వెళ్లి, సొకేలా తయాంగ్ అనే మహిళ ఓటు వేసేలా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌరులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కల్పించడమే ముఖ్యమని, అది ఒకరైనా, వేలమందైనా ఒకటేనని వ్యాఖ్యానించడం గమనార్హం.