Hyderabad: తెలంగాణలో పిడుగుల బీభత్సం... హైదరాబాద్ లో భారీ వర్షం!
- గత రాత్రి భారీ వర్షం
- తడిసిన ఆరబోసుకున్న ధాన్యం
- హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం
తెలంగాణలో నిన్న అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షం కురవగా, ఆరుగాలం శ్రమించిన తమ పంట నీటిపాలైందని రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. వడగండ్లు ఓ వైపు, పిడుగులు ఓ వైపు... తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలకు ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మరణించారు.
చెట్లపై పడిన పిడుగులు ఆ చెట్లను అమాంతం నిప్పుల్లో ముంచేయగా, ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ తదితర ఉమ్మడి జిల్లాల పరిధిలో కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో ఆరుబయట ఉంచిన పంట తడిసిపోయింది.
కాగా, హైదరాబాద్ పరిధిలో గత రాత్రి ఒంటి గంట నుంచి మూడున్నర వరకూ భారీ వర్షం కురిసింది. పలు కాలనీలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఉదయం రోడ్డుపైకి వచ్చిన వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా అమీర్ పేట్, చింతల్ బస్తీ, ముషీరాబాద్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఉప్పల్, రామాంతపూర్ ప్రాంతాల్లో నీరు రోడ్లపైకి చేరింది. ఆ నీటిని మళ్లించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు.