Tamil Nadu: ఓటు విలువను చాటిచెప్పిన కండక్టర్...అంబులెన్స్‌లో వెళ్లి మరీ ఓటు హక్కు వినియోగం
- రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు
- కాళ్లు విరగడంతో నడవలేని పరిస్థితి
- శస్త్ర చికిత్స జరిగిన మరునాడే పోలింగ్ బూత్‌కు
ప్రజాస్వామ్యంపై నమ్మకం, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యతగా భావించాలి. ఈ మాటలను అక్షరాలా అమలు చేశాడు ఓ కండక్టర్. ప్రమాదంలో కాలువిరిగి నడవలేని పరిస్థితుల్లో ఉన్నా అంబులెన్స్‌లో వచ్చిమరీ ఓటు వేసి తన బాధ్యత నెరవేర్చాడు.
వివరాల్లోకి వెళితే...తమిళనాడు రాష్ట్రం థేని జిల్లా పెరియకుళంకు చెందిన ముబారక్ అలీ ప్రభుత్వ బస్సు కండక్టర్. మంగళవారం నడిచి వెళ్తున్న ఆయనను మోటారు సైకిల్‌పై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని కాలు ఎముక విరిగింది. వెంటనే అతన్ని థేనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా బుధవారం కాలుకి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు.
ప్రస్తుతం నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆయన గురువారం జరిగిన రెండో విడత పోలింగ్‌లో ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. పెరియకుళంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన పరిస్థితి చూసి పోలింగ్ అధికారులు కూడా సహకరించారు. ప్రజాస్వామ్యంలో తన బాధ్యత నెరవేర్చాలన్న లక్ష్యంతో కష్టమైనా ఇలా ఇష్టంగా వచ్చినట్లు అలీ చెప్పారు.