Chandrababu: సెక్రటేరియట్ కు చంద్రబాబు రావచ్చు: ద్వివేది
- సీఎం, మంత్రులు వారి కార్యాలయాల్లో కూర్చోవచ్చు
- రాజకీయపరమైన పనులను మాత్రం చేయరాదు
- సీఎం మాతో మాట్లాడిన మాటల నివేదికను సీఈసీకి పంపాం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా సెక్రటేరియట్ కు రావచ్చని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కొన్ని సమీక్షలను కూడా ముఖ్యమంత్రి నిర్వహించవచ్చని అన్నారు. పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల్లో... ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు? అనే విషయం స్పష్టంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు వారివారి కార్యాలయాల్లో కూర్చోవచ్చని, అయితే రాజకీయపరమైన పనులను మాత్రం చేపట్టకూడదని తెలిపారు
ముఖ్యమంత్రి సమీక్షలపై తమకు వైసీపీ ఫిర్యాదు చేసిందని.... దీనిపై సీఎస్ ద్వారా సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరుతామని... వారి నివేదికల ఆధారంగా చర్యలు చేపడతామని ద్వివేది చెప్పారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు తమ కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని... సీఈసీ కోరిక మేరకు సీఎం మాట్లాడిన మాటలను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నివేదికను పంపామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ ల భద్రతపై కూడా సీఈసీకి నివేదిక పంపామని చెప్పారు.