BJP: బీజేపీ నేత ప్రజ్ఞా స్వాధీ ‘శాపం’ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ!
- ఆ ఉగ్రవాదులకు-మీకు పెద్దగా తేడా లేదు
- అమరులను అవమానించడానికి బీజేపీకి ఎంత ధైర్యం?
- ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించిన మజ్లిస్ అధినేత
తాను శపించడం వల్లే ముంబై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడని బీజేపీ నేత ప్రజ్ఞా సాధ్వీ వ్యాఖ్యానించడంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రజ్ఞా లాంటి వ్యక్తులతో పోరాడుతూనే కర్కరే ప్రాణాలు కోల్పోయారని చురకలు అంటించారు. అమరులను అవమానించడానికి బీజేపీకి ఎంత ధైర్యమని ప్రశ్నించారు.
ఈరోజు ట్విట్టర్ లో అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ..‘హేమంత్ కర్కరే ఎవరితో అయితే పోరాడుతూ చనిపోయారో, వాళ్లకు-మీకు పెద్దగా తేడా లేదు. మీరు బాధపడ్డందుకు, శపించినందుకు కర్కరే చనిపోలేదు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును, ఓటేసే మన హక్కును కాపాడటం కోసం పోరాడుతూ అమరుడయ్యారు. మన అమరులను ఇలా అవమానించడానికి బీజేపీకి ఎంత ధైర్యం?’ అని నిలదీశారు.