Andhra Pradesh: ఏపీ కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ ఆకస్మిక బదిలీ.. ఈసీ అభ్యంతరం!
- ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ఎన్నికల కోడ్
- ప్రతీ బదిలీకి ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరి
- అనుమతి లేకుండానే శివశంకర్ ను బదిలీచేసిన ప్రభుత్వం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నవేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ ను ఆకస్మికంగా బదిలీ చేసింది. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ బదిలీలు చేపట్టాలన్నా ఈసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఈ బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈసీ వర్గాలు ఏపీ ప్రభుత్వ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పోలవరం ప్రాజెక్టు, సీఆర్డీఏ పై చంద్రబాబు ఇటీవల సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సందర్భంగా మాత్రమే ముఖ్యమంత్రి ఇలాంటి సమీక్షలు నిర్వహించవచ్చనీ, కోడ్ ఉన్న నేపథ్యంలో సాధారణ సమీక్షలు చేయరాదని స్పష్టం చేసింది. దీంతో హోంశాఖ అధికారులతో నిర్వహించాల్సిన సమీక్షా సమావేశాన్ని చంద్రబాబు రద్దుచేసుకున్నారు. తాజాగా కాపు కార్పొరేషన్ అధికారిని బదిలీ చేయడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని ప్రభుత్వవర్గాల్లో చర్చ సాగుతోంది.