Gujarath: హార్దిక్ పటేల్ ను అందుకే కొట్టా.. వాడేమన్నా గుజరాత్ హిట్లరా?: తరుణ్ గజ్జర్
- సురేంద్ర నగర్ సభలో హార్దిక్ కు చెంపదెబ్బ
- అతని కారణంగా ఇబ్బందులు పడ్డానన్న తరుణ్
- షాపులన్నీ మూసేశారని ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ నేత, పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ పై ఓ వ్యక్తి ఈరోజు దాడిచేసిన సంగతి తెలిసిందే. సురేంద్ర నగర్ లోని ఓ బహిరంగ సభలో హార్దిక్ ప్రసంగిస్తుండగా, సమీపానికి వెళ్లిన తరుణ్ గజ్జర్, చెంపను చెళ్లుమనిపించాడు. దీంతో వేదికపైకి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను పక్కకు లాక్కెళ్లి చితక్కొట్టారు.
ఇదిలావుంచితే, తాజాగా ఈ విషయమై తరుణ్ మీడియాతో మాట్లాడుతూ ‘గతంలో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పటేళ్లకు రిజర్వేషన్ కోసం ఉద్యమం జరిగింది. అప్పుడు ఆమె అనారోగ్యానికి చికిత్స తీసుకుంటోంది. అప్పట్లో ఉద్యమం కారణంగా నా భార్యను కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. నేను అప్పుడే అనుకున్నా.. వీడిని కొట్టాలని.
ఎలాగైనా హార్దిక్ కు గుణపాఠం చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఇటీవల అహ్మదాబాద్ లో నా బిడ్డ వైద్యానికి మందుల కోసం వెళ్లాను. కానీ 'హార్దిక్ ర్యాలీ' అని షాపులన్నింటినీ మూసేశారు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రోడ్లు మూయించేస్తాడు. గుజరాత్ ను మూసేస్తారు. వాడేమన్నా గుజరాత్ హిట్లరా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.