MSK prasad: టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
- శుక్రవారం హైదరాబాద్కు ఎమ్మెస్కే
- నకిలీ ఖాతాతో తనపై దుష్ప్రచారం జరుగుతోందంటూ ఫిర్యాదు
- అందులో తన పరువుకు భంగం వాటిల్లే పోస్టులు ఉన్నాయన్న ఎమ్మెస్కే
టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా ప్రత్యక్షమైంది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా అందులో పోస్టులు పెడుతున్న విషయం ఆయన దృష్టికి రావడంతో శుక్రవారం ఆయన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు సోమవారం ముంబైలో బీసీసీఐ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ సన్నిహితులు కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతా విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఎమ్మెస్కే సాయంత్రం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నకిలీ ఖాతా విషయమై ఫిర్యాదు చేశారు. ఆ ఖాతా ద్వారా తనపై దుష్ప్రచారం జరుగుతోందని, తన పరువుకు భంగం వాటిల్లే అంశాలను పోస్టు చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఖాతా నిర్వహిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.