Andhra Pradesh: మోసం చేసినోళ్లెవరు?... రిపోర్ట్ తయారు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు!
- ఎన్నికల ఫలితాల వెల్లడికి నెల రోజుల సమయం
- గెలుపుపై అధికార, విపక్షాల ధీమా
- క్షేత్రస్థాయి నివేదికలు కోరిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. గెలుపు తమదంటే తమదని పైకి చెబుతున్న అధికార విపక్షాలు, లోలోపల మాత్రం గుబులుతోనే ఉన్నాయి. ఎవరి ధీమాలో వారున్నా, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్న విషయంపై నివేదికలు తయారు చేయిస్తున్నారు.
22న టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా తనను కలవాలని, ప్రతి ఒక్కరూ తమ విజయావకాశాలపై రిపోర్ట్ తేవాలని, ఎవరైనా మోసం చేస్తే, వారి వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం తరఫున పోటీ పడిన అభ్యర్థులు తమకు అనుకూలమైన పార్టీ శ్రేణులతో కలిసి నివేదికలను తయారు చేస్తున్నారు.
మండలాలు, గ్రామాల వారీగా పోలింగ్ బూత్ లు, వాటిలో పోలైన ఓట్లు, పోలింగ్ సరళి ఎలా సాగింది? సహకరించిన వారెవరు? సహకరించని వారెవరు? బలం ఏంటి? బలహీనతలు ఏంటి? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై ఈ నివేదికలు తయారవుతున్నట్టు తెలుస్తోంది.