Hyderabad: నిలిచిన హైదరాబాద్ మెట్రో... ప్రయాణికుల అవస్థలు!
- సాంకేతిక లోపంతో ఆగిన రైళ్లు
- సిగ్నల్స్ పనిచేయలేదన్న ఎన్వీఎస్ రెడ్డి
- అంతరాయానికి చింతిస్తున్నామని వెల్లడి
సాంకేతిక లోపం కారణంగా ఈ ఉదయం హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు చేరుకోవాల్సిన వారు ఇబ్బందులకు గురయ్యారు. స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోగా, రైళ్లు కనిపించక, వారంతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక అప్పటికే ప్రయాణిస్తున్న రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. తమను కనీసం సమీపంలోని స్టేషన్ వరకైనా తీసుకెళ్లాలని రైళ్లలోని ప్రయాణికులు నిరసన తెలిపారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్, హైటెక్ సిటీ నుంచి నాగోల్ మార్గాల్లో దాదాపు 20 రైళ్లు, పట్టాలపై నిలిచాయి.
కాగా, టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగానే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని ప్రకటించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఉదయం 7 గంటల సమయంలో సిగ్నలింగ్ సమస్య ఏర్పడిందని, ఆపై అరగంట వ్యవధిలోనే సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. రాత్రి కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఆయా ప్రాంతాల్లో సిగ్నల్స్ పని చేయలేదని ఆయన అన్నారు. ప్రయాణికులకు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.