Telangana: తెలంగాణలో ‘ఉగ్ర’ కలకలం.. హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు!
- మైలార్ దేవ్ పల్లిలోని శాస్త్రిపురంలో ఘటన
- స్థానిక పోలీసుల సాయంతో అధికారుల సోదాలు
- ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు
తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు ఉగ్ర కలకలం చెలరేగింది. నగరంలోని మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో ఉన్న శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. అబుదాబీ ఐసిస్ మాడ్యుల్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఇక్కడ నక్కి ఉన్నారన్న సమాచారంతో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు.
ఈరోజు ఉదయం 8 గంటలకు శాస్త్రిపురంలోని 8 మంది ఐసిస్ సానుభూతిపరులకు సంబంధించిన ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. గతేడాది అరెస్ట్ అయిన అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ తనిఖీల్లో ఏం బయటపడింది అన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాలేదు.