udhav thakarey: పాక్ పై దాడి చేసే దమ్మున్న ప్రధాని కావాలి: ఉద్ధవ్ థాకరే
- అందుకే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం
- ఆర్టికల్ 370 రద్దుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు
- కన్హయ్య కుమార్ ఒక విచ్ఛిన్నకర శక్తి
తమకు దేశ భద్రత అత్యంత ప్రధానమైన అంశమని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. పాకిస్థాన్ పై దాడి చేసే దమ్మున్న ప్రధాని దేశానికి అవసరమని... అందుకే బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఆర్టికల్ 370పై మాట్లాడుతూ, ఇండియాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న చట్టాలకు దూరంగా కశ్మీర్ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తే మువ్వన్నెల పతాకాన్ని కశ్మీరీలు గౌరవించరని మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు చెబుతున్నారని... ఆర్టికల్ రద్దుకు కాంగ్రెస్ కూడా సుముఖంగా లేదని విమర్శించారు. బిహార్ లో సీపీఐ టికెట్ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ గురించి స్పందిస్తూ... ఆయన ఒక విచ్ఛిన్న శక్తి అని థాకరే మండిపడ్డారు. కన్హయ్యలాంటి వారు లోక్ సభలో ప్రవేశించాలనుకుంటుండటం బాధాకరమని అన్నారు.