Telangana: కేసీఆర్ కు ఓటమి భయం.. అందుకే ముందుగా ఎన్నికలకు వెళుతున్నారు!: డీకే అరుణ
- చట్టాల సవరణపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
- టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే
- నల్గొండ కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేత
రెవిన్యూ శాఖలో పారదర్శకత కోసం చట్టాలను సవరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బీజేపీ నేత డీకే అరుణ తప్పుపట్టారు. చట్టాల్లో మార్పు కోసం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలు రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేవంలో అరుణ పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారా? లేక రెవిన్యూ అధికారులు పాల్పడుతున్నారా? అని అరుణ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలంతా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుంకుటున్నారని అభిప్రాయపడ్డారు.