Andhra Pradesh: ఈసీ ఆంక్షలు అన్నీ టీడీపీకే వర్తిస్తాయా?.. తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షలు పేపర్లలో వస్తున్నాయిగా?: నారా లోకేశ్
- కేసీఆర్ సమీక్షల్లో సీఎస్, డీజీపీ పాల్గొంటున్నారు
- తాగునీటి సమస్యపై సమీక్ష చేయలేకపోతే ప్రజలు ఏం కావాలి?
- ఈసీ తీరుపై ట్విట్టర్ లో మండిపడ్డ టీడీపీ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపే సమీక్షల్లో ప్రభుత్వ సీఎస్ తో పాటు డీజీపీ కూడా పాల్గొంటున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మరి తెలంగాణలో లేని అభ్యంతరం ఏపీలో ఎందుకని ఈసీని ప్రశ్నించారు. ఒక్క టీడీపీకే ఆంక్షలు ఎందుకని నిలదీశారు.
ఎండాకాలంలో తాగునీటిపై సమీక్ష చేసి చర్యలు తీసుకునే అధికారం లేకపోతే ప్రజల పరిస్థితి ఏం కావాలని అడిగారు. ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా? ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి?
ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోందని గుర్తుచేశారు. ఏపీలో వర్తించిన ఎన్నికల కోడ్ తెలంగాణకు వర్తించకపోవడం ఏంటని మండిపడ్డారు.