Rahul Gandhi: తండ్రిని దొంగ అన్నారు... రాహుల్ గురించి చెబుతూ తీవ్ర భావోద్వేగాలకు గురైన ప్రియాంక
- అన్నయ్య నియోజకవర్గంలో చెల్లెలి ప్రచారం
- వాయనాడ్ లో బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంక
- ప్రజలను విభజన చేయడం తప్ప ఏమీ సాధించలేదంటూ విమర్శ
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వాయనాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ఆమె ప్రచారానికి విచ్చేశారు. తన సోదరుడి గురించి చెబుతూ, "నేను ఒక చెల్లెలుగా మీ ముందుకు వచ్చాను, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మా అన్నయ్య ప్రజలకోసం నిలబడ్డారు" అంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
"ఆయన విద్యార్హతలను ప్రశ్నించారు, అమరుడైన తండ్రిని ఓ దొంగ అని నిందించారు, దశాబ్దకాలంగా ఆయనపై రకరకాలుగా దాడులు చేశారు, అయినా అన్నింటిని తట్టుకుని ఎదిరించి నిలిచారు" అంటూ రాహుల్ ను కీర్తించారు.
ఇక బీజేపీపైనా విమర్శలు చేశారు. ప్రతి రాష్ట్రమూ దేశంలో అంతర్భాగం, కానీ బీజేపీ ఈ ఐదేళ్లలో చేసింది ఏమిటంటే దేశాన్ని ముక్కలు చేయడం, ప్రజలను విభజించడమేనంటూ ధ్వజమెత్తారు. కేరళ, తమిళనాడు, యూపీ, గుజరాత్ అన్నీ దేశంలో భాగమేనని, కానీ బీజేపీ తన పాలనలో ప్రజల మధ్యన చీలిక తెచ్చిందని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ నేతలు నెరవేర్చలేదని ఆరోపించారు.
"రైతుల ఆదాయాన్ని పెంచేస్తామని చెప్పారు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు, నిరుద్యోగుల కోసం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు... వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందా?" అని ప్రియాంక నిలదీశారు.