modi: మళ్లీ అధికారంలోకి వస్తే 'ప్రధానమంత్రి కిసాన్' పథకంకు ఐదెకరాల ల్యాండ్ సీలింగ్ ఎత్తివేస్తాం: మోదీ
- ముంబై ఉగ్రదాడికి కాంగ్రెస్ ఎందుకు సమాధానం చెప్పలేదు
- ఎయిర్ స్ట్రయిక్స్ పై ఆధారాలు కావాలని వారు ఇప్పుడు అడగడం లేదు
- రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బిహార్ లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, హిందువుల పక్కన ఉగ్రవాది అనే పదాన్ని కాంగ్రెస్ చేర్చుతోందని మండిపడ్డారు. ముంబై ఉగ్రదాడి సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని... ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేందుకు సైన్యానికి యూపీఏ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ముష్కరులకు సరైన బుద్ధి చెప్పకుండా... హిందువులను టెర్రరిస్టులతో పోల్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
ఎయిర్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలని అడిగినవారు రెండు దశల పోలింగ్ పూర్తైన తర్వాత అడగడం లేదని... ఆ విషయాన్ని వారు ఎందుకు మరిచిపోయారని మోదీ ఎద్దేవా చేశారు. మన జవాన్ల ధైర్యసాహసాలను ప్రశ్నించినవారికి తాను ఒక సవాల్ విసురుతున్నానని... పుల్వామా దాడికి మనం ఎలా ప్రతీకారం తీర్చుకున్నామో జనాల్లోకి వెళ్లి అడగాలని అన్నారు. మన సైన్యం శక్తిసామర్థ్యాల గురించి కూడా అడగాలని చెప్పారు. ఇదే నా సవాల్ అని... అయితే, ఆ పని వారు చేయలేరని అన్నారు.
రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని బీహార్ లో చేస్తున్నారని... అగ్రవర్ణ పేదలకు కల్పిస్తున్న 10 శాతం రిజర్వేషన్లను కూడా తొలగిస్తారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు 'ప్రధానమంత్రి కిసాన్ యోజన' పథకం కింద ఆర్థికసాయం అందిస్తున్నామని... బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ సీలింగ్ ఎత్తివేసి, రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.