Rohit sekhar: ఎన్డీ తివారీ తనయుడి హత్య కేసులో భార్య అపూర్వ చుట్టూ తిరుగుతున్న అనుమానాలు
- చివరి వరకు కోడలి మాటల్నే నమ్మానన్న రోహిత్ తల్లి
- ప్రేమ వివాహమే అయినా తొలి రోజు నుంచే విభేదాలు
- గతేడాదే రోహిత్-అపూర్వల ప్రేమ వివాహం
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ చుట్టూ అనుమానాలు బలపడుతున్నాయి. రోహిత్ మరణం వెనక ఇంట్లోని వ్యక్తి పాత్ర ఉందని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ వ్యక్తి ఆయన భార్యే అయి ఉంటుందని భావిస్తున్నారు. శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ఈ నెల 16న రోహిత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లింది అపూర్వనే. అయితే, అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు చెబుతున్నారు.
రోహిత్-అపూర్వలది ప్రేమ వివాహం. ఏడాది క్రితమే వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పేరుకు ప్రేమ వివాహమే అయినప్పటికీ ఇద్దరి మధ్య తొలి రోజు నుంచే విభేదాలు తలెత్తినట్టు చెబుతున్నారు. రాజకీయంగా ఎదగలేకపోతున్నానని రోహిత్ తరచూ బాధపడుతుండేవాడని ఆయన తల్లి ఉజ్వల తెలిపారు. కాగా, ఈ నెల 11న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పోలింగ్ కేంద్రంలో ఇద్దరం కలిసే ఓటు వేసినట్టు తెలిపారు. ఆ తర్వాతి రోజు రోహిత్ తన తండ్రి సమాధిని సందర్శించాడని, 15న ఢిల్లీకి చేరుకున్నామని పేర్కొన్నారు. ఆ తర్వాత రోహిత్ అతడి ఇంటికి వెళ్లాడని, తాను ఫోన్ చేస్తే నిద్రపోతున్నట్టు అపూర్వ చెప్పిందని ఉజ్వల గుర్తు చేసుకున్నారు. అతడికి ఇటీవలే బైపాస్ సర్జరీ కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడని అనుకున్నానని పేర్కొన్నారు.
రోహిత్ ఇంటి నుంచి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫోన్ రాగానే అంబులెన్స్ తీసుకుని వెళ్లానని, అప్పటికే అతడిని కారులో ఆసుపత్రికి తరలించేందుకు అపూర్వ సిద్ధమవుతోందని తెలిపారు. చివరి వరకు కోడలు మాటల్నే నమ్మానని, తన కుమారుడిది హత్య అని తెలిసి షాక్‌కు గురయ్యానని ఉజ్వల కన్నీరు పెట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు అతడు నిద్రపోతున్నా ఎందుకు లేపలేదని ఉజ్వల ప్రశ్నించారు. పెళ్లైనప్పటి నుంచి వారి మధ్య సఖ్యత లేదని పేర్కొన్నారు.