Narendra Modi: మోదీకి ఛాన్స్ ఇస్తే 2024, 2029లో కూడా అబద్ధాలు చెబుతారు!: శత్రుఘ్నసిన్హా
- తప్పుడు వాగ్దానాలు ఇవ్వడంలో ఆయనకాయనే సాటి
- జీఎస్టీతో లక్షలాది మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు
- గుజరాత్ లోని వడోదరలో శత్రుఘ్నసిన్హా ఎన్నికల ప్రచారం
తప్పుడు వాగ్దానాలు ఇవ్వడంలో మోదీకి మోదీనే సాటి అని కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా మండిపడ్డారు. ప్రధాని మోదీకి అవకాశమిస్తే 2024, 2029లో కూడా అబద్ధాలు చెబుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని, చిన్న, మధ్యతరహా వ్యాపారులు కుదేలయ్యారని, ఫ్యాక్టరీల ఉత్పత్తి 50 శాతానికి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీని ఓడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇప్పుడు ఎవరు పప్పో, ఎవరు అబద్ధాల కోరో తేలిపోయింది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రాహుల్ పప్పూ అంటూ విమర్శించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం వడోదరలో శత్రుఘ్నసిన్హా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 'రాఫెల్ ఒప్పందం, పెద్దనోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అంశాల్లో నేను మోదీకి ప్రధాన విమర్శకుడిని. ఈ అంశాల్లో పార్టీ సీనియర్ నేతలను కానీ, క్యాబినెట్ మంత్రులను కానీ ప్రధాని ఏనాడూ సంప్రదించలేదు. ఆ కారణంగానే నేను ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాను' అని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ గెలవడం అసంభవమని అభిప్రాయపడ్డారు.