Rahul Gandhi: మోదీని జైలుకు పంపడానికి ఈ ఆధారాలు చాలు: రాహుల్ గాంధీ
- అధికారంలోకి వచ్చిన తర్వాత రాఫెల్ స్కాంపై విచారణ జరుపుతాం
- మోదీ జైలుకెళ్లక తప్పదు
- డసో సంస్థతో నేరుగా బేరం ఆడారు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలను తీవ్రతరం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాఫెల్ స్కాంపై కచ్చితంగా విచారణ జరుపుతామని, మోదీ తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక రాఫెల్ కుంభకోణంలో మోదీ పాత్రను ఆధారాలతో సహా బయటపెట్టిందని, మోదీ జైలుకు వెళ్లడానికి ఈ ఆధారాలు చాలని రాహుల్ వ్యాఖ్యానించారు.
డసో కంపెనీతో రాఫెల్ విమానాల బేరసారాల కోసం ప్రత్యేక బృందం ఉన్నా, ఆ బృందాన్ని పక్కనబెట్టి మోదీ తానే చర్చలు జరిపిన విషయం వెల్లడైందని అన్నారు. ఈ అవినీతిలో మోదీ పాత్రపై పక్కా ఆధారాలున్నాయని ఉద్ఘాటించారు. మోదీ సర్కారు కేవలం కొద్దిమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందని రాహుల్ ఆరోపించారు.