Telangana: తెలంగాణ జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు!
- కొత్తగూడెం జిల్లాలోని మోకాలగుంపు గ్రామంలో ఘటన
- కుటుంబ సభ్యులకు కొంతకాలంగా అనారోగ్యం
- శాంతి పూజలు చేయించాలన్న స్వామీజీ
తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో ఈరోజు క్షుద్రపూజల కలకలం చెలరేగింది. జిల్లాలోని ఓ గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారన్న ఆరోపణతో ఇద్దరు యువకులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయితే అనారోగ్యం కారణంగా తాము శాంతిపూజలు జరిపిస్తున్నామని ఆ యువకులు పోలీసులకు స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లాలోని మోకాలగుంపు గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో వారంతా ఓ స్వామీజీని ఆశ్రయించారు.
దీంతో తాను చెప్పినట్లు 2 రోజుల పాటు పూజలు చేస్తే సమస్యలన్నీ దూరం అవుతాయని చెప్పాడు. అనంతరం తన అనుచరుడు మధును వారితో పంపించాడు. వీరంతా నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఇతర పూజాసామగ్రితో ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి మధ్యలో పెద్ద గుంతను తవ్వారు. అయితే గుప్తునిధుల కోసమే వీరు గుంతను తవ్వారనీ, క్షుద్రపూజలు చేస్తున్నారని అనుమానించిన స్థానికులు ఆ ఇంట్లో ఉన్న యువకుడితో పాటు మధును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.