Mexico: సగం ఆస్తి అడిగిందని భార్యను సజీవ సమాధి చేసిన భర్తకు 51 ఏళ్ల జైలు శిక్ష
- మెక్సికోలో దారుణం
- విడాకులు కోరి బలైన భార్య
- ఐదేళ్ల నాటి ఉదంతంలో భర్తకు జైలు శిక్ష
మెక్సికోలో ఐదేళ్ల నాటి దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎవిల్ రెనే అనే వ్యక్తి తన భార్యకు సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో ఆమెను అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. బతికుండగానే ఆమెను పూడ్చివేశాడు. ఎవిల్ రెనే, శాండ్రా లుజ్ డియాజ్ మొరాలేస్ ఇద్దరూ దంపతులు. అయితే, ఎవిల్ ప్రవర్తన నచ్చకపోవడంతో శాండ్రా విడిగా ఉంటోంది. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
అయితే, మెక్సికో చట్టాల ప్రకారం భార్యకు విడాకులు ఇస్తే ఆస్తిలో సగం వాటా సమర్పించుకోవాల్సి ఉంటుంది. తన ఆస్తిని భార్యకు ఇవ్వడం ఇష్టలేని ఎవిల్ మరో ఐదుగురితో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించాడు. భార్య కారులో వస్తున్నట్టు తెలుసుకుని ముందే ఆ మార్గంలో యాక్సిడెంట్ అయినట్టుగా ఓ సీన్ క్రియేట్ చేశాడు. రోడ్డుపై ప్రమాదం జరిగినట్టు కనిపిస్తుండడంతో అది నిజమే అని నమ్మిన డియాజ్ తన కారు ఆపింది.
ఇదే అదనుగా భర్త ఎవిల్, మరికొందరు దుండగులతో కలిసి డియాజ్ కాళ్లు, చేతులు కట్టేసి సోదరుడికి చెందిన స్థలంలోనే పెద్ద గొయ్యి తవ్వి సజీవ సమాధి చేశాడు. దానిపై కాంక్రీట్ కూడా చేశారు. ఇదంతా 2014లో జరిగింది. ఆ స్థలం ఎవిల్ సోదరుడి పేరుమీదే ఉండుంటే ఆ కేసు ఎప్పటికీ బయటికి వచ్చేది కాదేమో!
కానీ, అతను ఆ స్థలాన్ని మరొకరికి విక్రయించగా, ఆ కొత్త యజమాని పెద్ద భవంతి నిర్మించేందుకు పునాదులు తవ్వాడు. దాంతో, డియాజ్ అస్థిపంజరం బయటపడింది. సీన్ కట్ చేస్తే... ఎవిల్ తో పాటు, అతని సోదరుడు, మరో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మెక్సికో పోలీసులు. కోర్టు వీరిందరికీ ఒక్కొక్కరికి 51 సంవత్సరాలు కఠిన కారాగారశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.