Sri Lanka: శ్రీలంక మారణహోమం: కొలంబోలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత
- శ్రీలంక క్యాబినెట్ అత్యవసర సమావేశం
- విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
- 180కి చేరిన మృతుల సంఖ్య
శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఉదయం ఆరు చోట్ల పేలుళ్లు జరగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. అంతలోనే మధ్యాహ్నానికి మరో రెండు పేలుళ్లు చోటుచేసుకోవడంతో అసలేం జరుగుతోందో అర్థంకాక శ్రీలంక ప్రజలు హడలిపోతున్నారు.
ఈ దాడులకు ఐసిస్ మాడ్యూల్ కారణమని నమ్ముతున్న శ్రీలంక సర్కారు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. దాడుల అనంతరం పరిస్థితులను సమీక్షించారు. మరికొన్ని గంటలపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించారు.
అంతేకాకుండా, కొలంబో నగరంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పేలుళ్ల నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటించారు. అయితే, దాడులపై ముందస్తు సమాచారం ఉన్నా, మారణహోమం జరగడం ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమేనంటూ శ్రీలంక విపక్షాలు మండిపడుతున్నాయి.
కాగా, ఈ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 180కి చేరినట్టు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య 450 వరకు ఉంది. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.